కేసీఆర� ఒత�తిడికి గ�రి అవ�త�న�నారా

<< Back


పండ్లున్న చెట్టుకే దెబ్బలన్నీ. అధికారంలో ఉన్న వారిపైనే ఆరోపణలు.. విమర్శలు కామన్. విమర్శల్ని రగిలిపోవటం.. ఆరోపణలకు ఉడికిపోవటం లాంటివి రాజకీయాల్లో ఏ మాత్రం సరికాదు. ప్రజాస్వామ్యంలో విమర్శ ఒక స్వేచ్ఛ. అలా అని సంబంధం లేకుండా.. ఇష్టారాజ్యంగా విమర్శలు చేయటాన్ని ఎవరూ హర్షించరు. అధికారంలో ఉన్న వారు విపక్షాల విమర్శలపై మండిపడటం.. మీకిష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. కేసులు పెడతామని హెచ్చరిస్తారా? అసలు అలాంటి పరిస్థితి వస్తుందా? అంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి తన మాటలతో రాజకీయ ప్రత్యర్థుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేయటం కేసీఆర్ కు అలవాటు. కానీ.. అందుకు భిన్నంగా కేసీఆరే తాజాగా ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. మహారాష్ట్రతో మహా ఒప్పందం చేసుకొని విజయగర్వంతో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ పై అంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయినట్లు? రెండేళ్లుగా తాను చూస్తున్నానని.. ఇప్పుడే ఇంతలా మాట్లాడుతున్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యను చూస్తే.. రెండేళ్ల నుంచి చూస్తున్న వ్యక్తి.. ఇప్పుడే అంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? అన్న ప్రశ్న ఎదురుకాక తప్పదు. అధికారపక్షానికి పరిమితులు ఉంటే.. విపక్షానికి అంతులేని స్వేచ్ఛ ఉంటుంది. గతంలో విపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎంతగా చెలరేగిపోయే వారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పలు సందర్భాల్లో చేసిన ఆరోపణలకు చాలా సందర్భాల్లో సాక్ష్యాలు..ఆధారాలు ఏమీ చూపించలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. తాను అధికారపక్షంగా మారిన సమయంలో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ఎందుకంటే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారన్న ప్రశ్నలోనే సమాధానం కనిపిస్తుంది. వాస్తవ జలదృశ్యం పేరిట తెలంగాణ కాంగ్రెస్ ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కేసీఆర్ మీద ఎంత ప్రభావం చూపించిందన్న విషయం ఆయన మాటల్ని చూస్తేనే అర్థమవుతుంది. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు మొత్తం కాకున్నా.. కొన్ని అంశాలు ఆయన్ను ఇబ్బంది పెట్టినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి. అదే సమయంలో.. తమ ప్రభుత్వంపై తరచూ ఆరోపణలు చేసినపక్షంలో ప్రజల్లో నెగిటివ్ ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉందన్న భయం కేసీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాలి వార్తలే అయినా వాటిని సమర్థించే కొందరు.. నిప్పు లేకుండా పొగ రాదుగా అంటూ సాగదీస్తూ.. లేనిపోని మకిలి అంటించే కార్యక్రమం చేస్తుంటారు. అలాంటిదే తమ ప్రభుత్వం విషయంలో జరిగితే డ్యామేజ్ ఎక్కువ అవుతుందన్న ముందస్తు జాగ్రత్తలోనే కేసీఆర్ అంత ఘాటుగా రియాక్ట్ అయి ఉంటారని భావిస్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడటాన్ని ఎవరూ తప్పు పట్టటం లేదు.. కానీ.. ఉత్తి పుణ్యనానికి ఆరోపణలు చేస్తే మాత్రం కేసులు తప్పవని.. అరెస్ట్ చేసి జైల్లో పెడతానని ఆయన వ్యాఖ్యానించటంపైనే అభ్యంతరం వ్యక్తమవుతోంది. తమ మాటలతో ఒత్తిడి పెంచే కేసీఆర్ మైండ్ గేమ్ నే ఈసారి కాంగ్రెస్ నేతలు అనుసరించటం.. దానికి స్పందించిన కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తే సరిపోయేది. కానీ.. ఆయనలోని ఆవేశం హద్దులు దాటటంతో.. కేసులు.. జైళ్లు వగైరా లాంటి మాటలు వచ్చేశాయి. తాను నలభై నిమిషాలు రోడ్డు మీదనే ఉంటానని.. తుమ్మిడిహట్టికి సంబంధించి చేస్తున్న ఉత్తమ్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తీసుకొస్తే.. అటు నుంచి అటే నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు.. రాజకీయసన్యాసం చేస్తానంటూ ఓపెన్ సవాలు చేసినప్పుడు కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ ఎంతలా పెరగాలో అంతలా పెరిగిందని చెప్పాలి. కానీ.. అఖర్లో ఉత్తి పుణ్యానికి ఆరోపణలు చేస్తే.. కేసులు తప్పవని హెచ్చరికతో ముందు వచ్చిన మైలేజీని కేసీఆర్ తనకు తానే చెడగొట్టుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు.. విమర్శలకు ఒత్తిడికి గురి అవుతున్నారన్న భావనను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి దమ్ముగా మాట్లాడటాన్ని అందరూ హర్షిస్తారు. అదే సమయంలో ఆరోపణలు చేసే వారిపై కేసులు పెడతానంటేనే వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. దమ్ము మాటలకు.. వార్నింగ్ కు మధ్యనున్న వ్యత్యాసం ఎక్కువే. కాకుంటే.. అధికారపక్షం వార్నింగ్ ఇవ్వటాన్ని ప్రజలు హర్షించరన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే సరిపోతుంది. మరి.. పవర్ చేతిలో ఉన్న ఆయన ఆ విషయాన్ని గుర్తిస్తారా..?

Related Top Stories