పవన్ పై ‘‘కాపునాడు’’ ఫైర్

<< Back


సీమాంధ్రుల ఆత్మగౌరవ సదస్సు పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కాకినాడ సభ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. సభలో చోటు చేసుకున్న ఒకఘటనలో పవన్ అభిమాని మరణించటం.. మరికొందరు గాయపడిన ఘటన తప్పించి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రత్యేక హోదాపై కేంద్రం.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీదా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. సభలో కాపు రిజర్వేషన్ల గురించి మాట వరసకు కూడా ప్రస్తావించలేదంటూ కాపునాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపు.. బలిజ.. ఒంటరి.. తెలగ కులస్తుల సమస్యలు పవన్ కల్యాణ్ కు పట్టవా? అని ప్రశ్నించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక సమస్యలు ప్రస్తావించిన పవన్ కాపు రిజర్వేషన్ల గురించి మాత్రం పెదవి విప్పకపోవటం ఏమిటంటూ?ప్రశ్నించింది. జనసేన పార్టీ అధినేతగా కాపు రిజర్వేషన్ల మీద తన వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓపక్క తనకు కులం.. మతం లాంటివేమీ పట్టవని.. తాను వాటిని పట్టించుకోనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ ను.. కాపునాడు రాష్ట్ర కమిటీ తప్పు పట్టటం గమనార్హం. రాష్ట్రంలో అన్ని సమస్యలపై పవన్ స్పందిస్తున్నట్లుగా కాపునాడు చెబుతోంది. కానీ.. పవన్ వ్యాఖ్యల్ని చూస్తే.. ఆయన మాటలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతుందే తప్పించి మరే సమస్య మీద తిరగటం లేదని చెప్పాలి. కాకినాడ సభలోనే తొలిసారి ఆయన హోదా కాకుండా మరికొన్ని అంశాల్ని ప్రస్తావించారని చెప్పాలి. అందులో ఒకటి ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయటం.. ఏపీ సర్కారు తన ఫోకస్ అంతా రాజధాని అమరావతి మీదనే పెట్టిందని.. రాజధాని ఒక్కటే కాకుండా మిగిలిన అంశాల మీద కూడా దృష్టి సారించాలని కోరారు. ఒక వర్గానికో.. ఒక కులానికో పరిమితమయ్యే అంశాల మీద ఇప్పటివరకూ స్పందించని పవన్.. కాపునాడు రాష్ట్ర కమిటీ అభ్యంతరాలపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారినట్లే.

Related Top Stories